కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. హమాల్ వాడిలోని సిఐటియు (CITU) కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత 12 ఏళ్ల మోదీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయని, కానీ కార్మికుల వేతనాలు మాత్రం పెరగలేదని నేతలు మండిపడ్డారు.కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. నెలకు కనీస పెన్షన్ రూ. 9,000 అమలు చేయాలి. పనిగంటల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి.పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలి. కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్ట కొడుతున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఫిబ్రవరి 12న అన్ని రంగాల కార్మికులు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొనాలని జేఏసీ నాయకులు ఓమయ్య (AITUC), నూర్జహాన్ (CITU), సుధాకర్ (TUCI), శివకుమార్ (IFTU) కోరారు.ఈ సమావేశంలో జిల్లాలోని వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు జి. భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
