ప్రపంచంలోనే అరుదైన కూర్మనాథ స్వామి ఆలయానికి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చొరవతో, ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ (IndiGo) తన సామాజిక బాధ్యత (CSR) నిధులతో ఆలయ అభివృద్ధికి ముందుకు వచ్చింది. బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, ఆర్కిటెక్ట్‌లతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించారు.

ఆలయ సమగ్ర అభివృద్ధి కోసం రూ. 10 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతగా ఇండిగో సంస్థ రూ. 3 కోట్లను ఇప్పటికే విడుదల చేసింది. రాబోయే 30 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికను రూపొందించారు. శ్వేత పుష్కరిణి కోనేరు గట్టుపై ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా సుందరీకరణ. ఆలయ వైభవం ప్రతిబింబించేలా నూతన ప్రధాన ముఖద్వార నిర్మాణం. భక్తుల వసతి గృహాలు, క్యూ లైన్లు, తాగునీరు వంటి సౌకర్యాల కల్పన. పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, ఆర్కిటెక్ట్‌లు మరియు జలవనరుల శాఖ ఇంజనీర్లకు ఎమ్మెల్యే గొండు శంకర్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, ఆలయ ధర్మకర్తలు మరియు స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
