ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పిలుపునిచ్చారు. బుధవారం మేడారంలోని మీడియా సెంటర్లో జాతరను కవర్ చేస్తున్న జర్నలిస్టులకు ఆమె ప్రత్యేక టీ-షర్ట్‌లను పంపిణీ చేశారు.
జాతర ఏర్పాట్లలో ఎన్ని మార్పులు చేసినా, ఆదివాసుల అస్థిత్వం, ఆత్మగౌరవం మరియు పూజా విధానాల్లో ఎక్కడా మార్పు లేకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోడ్డు విస్తరణ, నిరంతర పారిశుధ్యం, విద్యుత్ దీపాలంకరణ మరియు మెరుగైన క్యూ లైన్ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నాలుగు రోజులు జరిగే జాతర కోసం 40 రోజులకు సరిపడా మౌలిక వసతులు సిద్ధం చేశామని, అదనపు కార్మికులను ఇప్పటికే రంగంలోకి దించామని వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.జాతర విశేషాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో మీడియా పాత్ర కీలకమని, భవిష్యత్తులో జర్నలిస్టుల కోసం మరిన్ని మెరుగైన వసతులు, భారీ హాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
