హైదరాబాద్‌లో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. కోటిలోని ఎస్‌బీఐ (SBI) మెయిన్ బ్రాంచ్ ఏటీఎం వద్ద శనివారం ఉదయం కాల్పులు జరిపి భారీ దోపిడీకి పాల్పడ్డారు. నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఒక వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.నంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి రషీద్ (Rashid) శనివారం ఉదయం 7 గంటల సమయంలో సుమారు రూ. 6 లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు తన స్కూటర్ పై కోటి ఎస్‌బీఐ ఏటీఎం సెంటర్‌కు వచ్చారు. అప్పటికే అతడిని వెంబడిస్తూ యాక్టివాపై వచ్చిన ఇద్దరు దుండగులు మొదట రెక్కీ నిర్వహించారు.

రషీద్ ఏటీఎం లోకి ప్రవేశించగానే, దుండగులు లోపలికి వెళ్లి గన్‌తో రషీద్ కాలిపై కాల్పులు జరిపారు. అనంతరం అతడి వద్ద ఉన్న నగదు సంచిని లాక్కుని, రషీద్ స్కూటర్‌పైనే అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దోపిడీకి సంబంధించిన దృశ్యాలు ఏటీఎం లోని CCTV కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలానికి చేరుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు మరియు ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి దర్యాప్తు ప్రారంభించారు. రషీద్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

