గత పాలకులు కామారెడ్డి మున్సిపాలిటీని అవినీతి, అప్పుల ఊబిలోకి నెట్టారని, తన హయాంలో ఆ పరిస్థితిని చక్కదిద్దుతున్నానని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్ నాయకుల తీరుపై నిప్పులు చెరిగారు.

గతంలో రూ. 70 కోట్లుగా ఉన్న మున్సిపల్ అప్పులను, తన ప్రత్యేక చొరవతో రూ. 30 కోట్లు తగ్గించి ప్రస్తుతం రూ. 40 కోట్లకు తీసుకువచ్చామని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ వార్షిక ఆదాయం రూ. 6 కోట్లు ఉండగా, ఖర్చు రూ. 18 కోట్లుగా ఉందని గుర్తుచేశారు. పట్టణంలో మురుగు కాలువల నిర్మాణం కోసం రూ. 18.70 కోట్లు మంజూరు చేయిస్తే, కాంగ్రెస్ నాయకులు వాటిని సీసీ రోడ్ల కోసం మళ్లించే ప్రయత్నం చేశారని, మళ్లీ వాటిని కాలువల కోసమే కేటాయించేలా పోరాటం చేశానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో 18 వేల మంది విద్యార్థులు నేలపై కూర్చుంటున్నారని, వారికి కేపీఆర్ జనసేనా ట్రస్ట్ ద్వారా రూ. 232 కోట్లు వెచ్చించి టేబుల్ డెస్క్‌లను అందజేస్తున్నామని ప్రకటించారు. గడిచిన రెండేళ్లలో ఒక్క రూపాయి లంచం లేకుండా వెంచర్లకు అనుమతులు ఇచ్చామని, మున్సిపల్ కార్మికులను గత నేతలు తమ సొంత పనులకు వాడుకుంటే, ఇప్పుడు వారు కేవలం మున్సిపాలిటీ సేవలకే అంకితమయ్యారని పేర్కొన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగిరితేనే నీతి, నిజాయితీ పాలన సాధ్యమని, ఇతర పార్టీలు గెలిస్తే అవినీతి పెచ్చరిల్లుతుందని హెచ్చరించారు.
