కానిస్టేబుల్ సౌమ్యకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

February 2, 2026 6:19 PM

విధి నిర్వహణలో గంజాయి స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య (24) అంత్యక్రియలు ఆదివారం ఆమె స్వస్థలమైన మోస్రాలో అధికార లాంఛనాలతో ముగిశాయి. ‘సౌమ్య అమర్ హై’ అన్న నినాదాల మధ్య వేలాది మంది ప్రజలు అశ్రునయనాలతో ఆమెకు తుది వీడ్కోలు పలికారు.

రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య తదితరులు సౌమ్య పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.వీరమరణం పొందిన సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం రూ. కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పూర్తి జీతంతో కూడిన పెన్షన్ అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. సౌమ్య మృతికి కారణమైన స్మగ్లర్లపై కఠిన చట్టాలను ప్రయోగిస్తామని, గంజాయి రహిత తెలంగాణే ఆమెకు నిజమైన నివాళి అని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జరగకుండా ఎక్సైజ్ సిబ్బందికి కూడా ఆయుధాలు కేటాయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. పోలీసుల గౌరవ వందనం నడుమ, అధికారిక లాంఛనాలతో సౌమ్య అంత్యక్రియలు జరిగాయి. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలర్పించిన సౌమ్య సాహసాన్ని ప్రతి ఒక్కరూ శ్లాఘించారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media