21వ శతాబ్దంలోనూ కులం పేరుతో వివక్ష కొనసాగుతూనే ఉంది. SC వర్గానికి చెందిన యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న నెపంతో ఒక కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరించిన (వెలివేసిన) ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామంలో వెలుగుచూసింది.

సంగమేశ్వర్ గ్రామానికి చెందిన నీల స్వామి కుమారుడు ప్రశాంత్, 2021లో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సీ వర్గానికి చెందిన జ్యోత్స్నను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో ఉన్న వారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడు నెలల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చారు. ప్రశాంత్ కుటుంబం గ్రామానికి వచ్చినప్పటి నుండి కుల పెద్దలు వారిపై వివక్ష చూపడం ప్రారంభించారు. “అంటరాని అమ్మాయి పెట్టిన భోజనం మేము ఎలా తింటాం?” అంటూ సంఘంలో అవమానించారు.పోలీసుల సమక్షంలో రాజీకి ఒప్పుకున్న కుల పెద్దలు, బయటకు రాగానే మాట తప్పారు. బాధిత కుటుంబంతో ఎవరైనా మాట్లాడినా, శుభకార్యాలకు పిలిచినా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) జరిమానా విధిస్తామని హుకుం జారీ చేశారు. కుల బహిష్కరణతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నీల స్వామి కుటుంబ సభ్యులు సోమవారం కామారెడ్డి జిల్లా ఎస్పీని కలిసి తమకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
