TG:వేములవాడ ‘దొంగ బాబా’ ముఠా అరెస్ట్.. రూ. 7 లక్షలు స్వాధీనం

February 3, 2026 1:03 PM

మృత్యుభయం చూపిస్తూ, లంకె బిందెల ఆశ చూపి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న కిలాడీ ముఠా గుట్టును కామారెడ్డి పోలీసులు రట్టు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన కడమంచి నర్సింలు అనే దొంగ బాబాతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం ఓన్నాజిపేట గ్రామానికి చెందిన బీరవ్వకు మాయమాటలు చెప్పారు. ఇంట్లో లంకె బిందెలు ఉన్నాయని, పూజలు చేయకపోతే కుటుంబంలో మరణం సంభవిస్తుందని భయపెట్టి ఆమె వద్ద నుండి రూ. 8.20 లక్షలు కాజేసి మొహం చాటేశారు. గతేడాది అక్టోబర్‌లో కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామంలో లాస్య అనే మహిళ కుటుంబాన్ని కూడా ఇదే తరహాలో మోసం చేశారు. కుటుంబంలో అనారోగ్య సమస్యలను ఆసరాగా చేసుకుని, లంకె బిందెలు తీయాలని నమ్మించి రూ. 2.93 లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7 లక్షల నగదు, రెండు కార్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, ఇటువంటి దొంగ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర సూచించారు. ఇంకా ఎవరైనా వీరి చేతిలో మోసపోయి ఉంటే ధైర్యంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media