మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఆశావహులు జిల్లా పార్టీ అధ్యక్షుడు నందయ్య నివాసం వద్ద ఆందోళనకు దిగారు.
జగిత్యాల పట్టణంలోని 26వ వార్డుకు చెందిన పద్మజకు తొలుత టికెట్ కేటాయించి, ఆ తర్వాత బీ-ఫామ్ రాలేదని చెప్పడంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.మెట్‌పల్లి 24వ వార్డు అభ్యర్థిని, మహిళా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు ఎదుర్తి హారితకు టికెట్ నిరాకరించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న తనకు మొండిచెయ్యి చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ-ఫామ్ ఇవ్వకపోతే మెట్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుడి నివాసంలో వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఆగ్రహానికి గురైన జిల్లా అధ్యక్షుడు నందయ్య.. తన వద్ద ఉన్న బీ-ఫామ్ ను చింపివేసినట్లు తెలుస్తోంది.టికెట్ల వేటలో ఉన్న నేతలు ఇలా బాహాటంగా అసమ్మతి తెలపడం, ఆత్మహత్య హెచ్చరికలు జారీ చేయడంతో జగిత్యాల కాంగ్రెస్ లో గందరగోళ పరిస్థితి నెలకొంది.
