ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను ‘జాతిపిత’గా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన ఆయన, ప్రజాస్వామ్యంలో ఎవరూ చట్టానికి అతీతులు కారని స్పష్టం చేశారు.

“మహాత్మా గాంధీ దేశం కోసం పదవులు త్యాగం చేశారు. కానీ ఇక్కడ జాతిపిత అని చెప్పుకునే వారు పదవులు అనుభవించి, వేల కోట్లు సంపాదించారు. వీరు ఎలా ఉద్యమకారులవుతారు?” అని రేవంత్ ప్రశ్నించారు.ప్రొఫెసర్ కోదండరాం గారి ఇంటి తలుపులు బద్దలు కొట్టినప్పుడు గుర్తుకు రాని ప్రజాస్వామ్యం, ఇప్పుడు మీకు నోటీసులు ఇస్తే గుర్తుకొచ్చిందా? అని నిలదీశారు. పాతకాలపు చక్రవర్తులు తమ వ్యక్తిగత బాధను రాజ్య బాధగా మార్చేవారని, కేసీఆర్ కూడా అలాగే చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమని, తప్పు చేస్తే ఎవరైనా విచారణ ఎదుర్కోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రజలు ఓడించినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని, ప్రజలే తప్పు చేశారని అనడం వారి అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలు ఆయన అజ్ఞానానికి, అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. తెలంగాణ తెచ్చిన నేతపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
