సోషల్ మీడియాలో ఫాలోవర్ల కోసం, లైకుల కోసం యువత ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. తాజాగా ఓ యువకుడు వేగంగా వస్తున్న రైలు కింద, పట్టాల మధ్య పడుకుని రీల్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ప్రమాదకర విన్యాసంపై సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ వీడియోను తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ, “వైరల్ పిచ్చితో ఇలాంటి పనులు చేయడం సాహసం కాదు.. అది పరాకాష్ఠకు చేరిన మూర్ఖత్వం” అని సజ్జనార్ పేర్కొన్నారు. ఒక్క సెకను తేడా జరిగినా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని, సోషల్ మీడియా మోజులో పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దని ఆయన హెచ్చరించారు. “బాధ్యతగా ఉండటం నేర్చుకోండి (Be Responsible, Not Reckless)” అంటూ యువతకు హితవు పలికారు.
