మండలంలోని కార్లయి గ్రామ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై పోలీసులు విరుచుకుపడ్డారు. ముందస్తు సమాచారంతో బుధవారం అర్థరాత్రి ఎస్ఐ రాజకుమార్ ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది.
గుడుంబా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన సుమారు 400 లీటర్ల బెల్లం పానకాన్ని పోలీసులు గుర్తించి, అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేశారు. అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు నమోదు చేశారు.”ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే గుడుంబా సాగును సహించం. మండలాన్ని గుడుంబా రహితంగా మార్చడమే మా లక్ష్యం” అని ఎస్ఐ రాజకుమార్ స్పష్టం చేశారు. బెల్లం పానకం నిల్వ ఉంచినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.సమాచారం ఉన్నవారు భయం లేకుండా పోలీసులకు తెలియజేయాలని కోరారు.
