పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని సముద్ర స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులను మృత్యువు అలల రూపంలో కబళించింది. చిన్నగంజాం మండలం పల్లెపాలెం బీచ్ వద్ద జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది.
దుద్దుకూరు జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న చందులూరి శ్రీరామ్ పుట్టినరోజు కావడంతో, తన స్నేహితులు బిక్కి అవినాష్, తాటిపర్తి హేమంత్, గుంజి హేమవర్ధన్‌లతో కలిసి పల్లెపాలెం బీచ్‌కు వెళ్లారు.
నలుగురు స్నేహితులు సరదాగా సముద్రంలోకి దిగారు. అయితే అకస్మాత్తుగా వచ్చిన భారీ అలల ఉధృతికి చందులూరి శ్రీరామ్, బిక్కి అవినాష్‌లు నీటిలో మునిగి కొట్టుకుపోయారు. మిగిలిన ఇద్దరు విద్యార్థులు హేమంత్, హేమవర్ధన్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు.తమ పిల్లలు కళ్లముందే గల్లంతవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బీచ్ సమీపంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
