రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. శుక్రవారం ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించి, మినిస్టర్స్ బంగ్లాలు, జీఏడీ టవర్ డయాగ్రిడ్ ఫ్యాబ్రికేషన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రభుత్వ అధికారుల కోసం నిర్మిస్తున్న 4,026 ఇళ్లలో 3,500 ఇళ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. 350 కి.మీ ట్రంక్ రోడ్లు, 1500 కి.మీ లేఅవుట్ రోడ్లతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ లైన్ల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయని వెల్లడించారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ మరియు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం ఖతార్, లండన్ దేశాలలో అధ్యయనం చేశామని, అంతర్జాతీయ ప్రమాణాలతో వీటిని నిర్మిస్తామని పేర్కొన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి గ్రామాల వారీగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, రైల్వే స్టేషన్ భూ సేకరణపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు.ప్రభుత్వ భవనాలతో పాటు ప్రైవేట్ సంస్థల నిర్మాణాలు కూడా వేగవంతం కావడంతో అమరావతిలో మళ్లీ పూర్వవైభవం కనిపిస్తోందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు
