అసంఘటిత రంగ కార్మికుల భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ ధన్’ (PM-SYM) పథకంపై తెగచర్ల గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రాపూరు మండల బీజేపీ అధ్యక్షులు దూడల పెంచలయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
జిల్లా లేబర్ ఆఫీసర్లు వై. సత్యనారాయణ, సి.హెచ్. వేణుగోపాల్ ముఖ్య అతిథులుగా హాజరై పథక విశిష్టతను వివరించారు. చిరు వ్యాపారులు, అసంఘటిత కార్మికులు ఈ పథకం ద్వారా వృద్ధాప్యంలో గౌరవప్రదమైన పెన్షన్ పొందవచ్చని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు మరియు వివిధ రకాల కూలీలు ఈ పథకానికి అర్హులని, తక్కువ ప్రీమియంతో నెలకు రూ. 3,000 పెన్షన్ పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులైన కార్మికులందరూ వెంటనే తమ పేర్లను నమోదు చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సామాజిక భద్రతా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
