న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించి, నకిలీ పత్రాలతో జైలు నుంచి తప్పించుకున్న నిందితులకు ఆదోని కోర్టులో చుక్కెదురైంది. 2013లో జరిగిన ఈ సంచలన ఘటనపై సుదీర్ఘ విచారణ పూర్తి చేసిన జేఎఫ్‌సీఎం (JFCM) కోర్టు, నిందితులందరికీ జైలు శిక్ష విధిస్తూ శనివారం కీలక తీర్పునిచ్చింది.

2013లో ఆదోని సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న జగపతి మహేష్, తన మిత్రుడైన కానిస్టేబుల్ రఘునాథ్ సహకారంతో ఆత్మకూరు కోర్టు పేరుతో నకిలీ బెయిల్ ఉత్తర్వులను సృష్టించాడు. జైలు అధికారులను నమ్మించి అప్పట్లో అక్రమంగా విడుదలయ్యాడు. ఈ మోసాన్ని గుర్తించిన పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా, 12 ఏళ్ల విచారణ తర్వాత ఆదోని కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. ప్రధాన నిందితుడు మహేష్, కానిస్టేబుల్ రఘునాథ్‌తో సహా మరో ఐదుగురికి 3 ఏళ్ల సాధారణ జైలు శిక్ష మరియు రూ. 10,000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 నెలల శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు. (నిందితుల్లో ఒకరు విచారణ సమయంలోనే మరణించారు).
