అజయ్ అరసాడకు పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్..

August 18, 2026 2:22 PM
Ajay Arasada with Pawan Kalyan during their meeting

జనసేన, పీకే క్రియేటివ్స్ కోసం పనిచేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారన్న అజయ్
ఏఐ మ్యూజిక్‌పై అసంతృప్తి.. క్రెడిట్స్ విషయంలోనూ సమస్యలు

‘ఆయ్’, ‘సేవ్ ది టైగర్స్’, ‘వికటకవి’, ‘గుర్తుకొస్తున్నాయి..’ వంటి సినిమాలు, సిరీస్‌లకు మంచి మ్యూజిక్ అందిస్తూ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇటీవల Pawan Kalyan స్వయంగా అజయ్‌ను పిలిచి అభినందించారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ కోసం పనిచేయబోతున్నానని అజయ్ తెలిపారు.

తన జర్నీ గురించి అజయ్ మాట్లాడుతూ.. తమ కుటుంబంలోనే ఆర్ట్, మ్యూజిక్ ఉందని చెప్పారు. వైజాగ్‌లో బీటెక్ పూర్తి చేసి TCSలో ఏడేళ్లు ఉద్యోగం చేశానన్నారు. ఉద్యోగం చేస్తూనే రెండు సినిమాలకు పనిచేశానని, తన భార్య ఎంతో సపోర్ట్ చేసిందని తెలిపారు.

సంగీత దర్శకుడు శ్రీ చరణ్ ‘గూఢచారి’ సినిమాకు పిలవడంతో కీబోర్డ్ ప్రోగ్రామర్‌గా తన కెరీర్ మొదలైందని చెప్పారు. రెండు సినిమాల తర్వాత సొంతంగా సినిమాలకు మ్యూజిక్ చేయడం ప్రారంభించానన్నారు.

అన్ని రకాల జానర్లలో పనిచేయడానికి ఇష్టపడతానని, తన వద్దకు వచ్చిన కథకు న్యాయం చేయాలని చూస్తానని తెలిపారు.

పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేక భేటీ

పవన్ కళ్యాణ్‌ను కలిసిన విషయాన్ని అజయ్ అరసాడ వివరించారు. తన ఫ్రెండ్ వెంకట్ చిక్కాల జనసేనలో ఎడిటర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. కొన్నేళ్ల క్రితమే జనసేనకు కొన్ని సాంగ్స్, వీడియోలకు మ్యూజిక్ చేశానన్నారు.

తన వర్క్ నచ్చడంతో బన్నీ వాస్ ‘ఆయ్’ సినిమా అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇటీవల మోదీని పవన్ కళ్యాణ్ కలిసిన సమయంలో ఆ వీడియోకు తాను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశానని చెప్పారు.

ఆ వర్క్ పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లడంతో తనను పిలిపించారని వివరించారు.

మొదట ఐదారు నిమిషాలు మాట్లాడి, ఫోటో దిగి వచ్చేస్తానని అనుకున్నానని అజయ్ చెప్పారు. కానీ తాను వెళ్లేసరికి పర్సనల్ మీటింగ్ రూమ్‌లో పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారని, దాదాపు గంటసేపు తనతో మాట్లాడారని తెలిపారు.

సరదాగా కూడా మాట్లాడారని, తన వర్క్‌ను అభినందించారని చెప్పారు.

జనసేన కోసం, పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ పీకే క్రియేటివ్స్ బ్యానర్ కోసం కలిసి పనిచేద్దామని పవన్ కళ్యాణ్ చెప్పారని అజయ్ తెలిపారు.

మ్యూజిక్ ఇండస్ట్రీలో సమస్యలు

మ్యూజిక్ ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యల గురించి కూడా అజయ్ మాట్లాడారు. ఒక్కో సింగర్ ఒక్కో విధంగా ఛార్జ్ చేస్తారని చెప్పారు.

తన పాటకు ఎవరు సెట్ అయితే వారితోనే పాడించాలని అనుకుంటానని,

కానీ కొంతమంది దర్శక నిర్మాతలు ఫేమ్ ఉన్నవాళ్లు లేదా తమిళ్, మలయాళం సింగర్స్ కావాలని కోరుకుంటారని తెలిపారు.

పాటను ఫైనల్ చేసేది తాను ఒక్కరే కాదని, చాలా మంది కలిసి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. థియేటర్‌కు సరిపోయేలా మ్యూజిక్, స్కోర్ ఇస్తామని, కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత మ్యూజిక్ లెవల్స్ మారిపోతున్నాయని అన్నారు.

దీంతో తమ మ్యూజిక్ తమకే సంతృప్తి ఇవ్వడం లేదని, అప్పటి వరకు పడిన కష్టం వృథా అవుతోందని తెలిపారు.

తాను చేసిన ‘వికటకవి’ సిరీస్‌ను థియేటర్‌లో చూస్తే సౌండింగ్ మరో లెవల్‌లో ఉంటుందని, ఓటీటీకి వచ్చేసరికి అది 50 శాతానికి పడిపోతుందని అజయ్ చెప్పారు.

ఏఐ మ్యూజిక్‌పై అజయ్ అసంతృప్తి

కొంతమంది నిర్మాతలు ఇటీవల ఏఐని ఉపయోగించి తయారైన ట్రాక్స్‌ను పంపి, వాటిలా మ్యూజిక్ కావాలని అడుగుతున్నారని అజయ్ తెలిపారు. అలాంటప్పుడు తామెందుకు పనిచేయాలని అనిపిస్తుందని అన్నారు.

పూర్తిస్థాయిలో ఏఐ మ్యూజిక్ డైరెక్టర్ పని చేయలేదని చెప్పారు. గతంలో దర్శకులు సన్నివేశం, కాన్సెప్ట్, భావాన్ని వివరించి దానికి తగ్గట్టుగా ట్యూన్ కావాలని చెప్పేవారని,

ఇప్పుడు వస్తున్న చాలా మంది దర్శకులకు ఆ అవగాహన లేదని అన్నారు. ఎలాంటి పాట కావాలని అడిగినా చెప్పలేకపోతున్నారని, మ్యూజిక్‌పై అవగాహన తగ్గిందని తెలిపారు.

‘ఆయ్’ క్రెడిట్స్‌పై అజయ్ వ్యాఖ్యలు

క్రెడిట్స్ విషయంలోనూ కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని అజయ్ చెప్పారు. ‘ఆయ్’ సినిమాకు తాను మూడు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చేశానని, రామ్ మిర్యాల రెండు పాటలు ఇచ్చారని తెలిపారు.

అయితే చాలా చోట్ల రామ్ మిర్యాల పేరే వినిపించిందని, తన పేరు కనిపించలేదని చెప్పారు.

తన టీంలో పనిచేసే ప్రతి ఒక్కరికీ తాను తప్పకుండా క్రెడిట్ ఇస్తానని అజయ్ అరసాడ తెలిపారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media