కారు దహనం వెనుక కుట్ర కోణం…నలుగురి హత్య

May 29, 2026 11:14 AM

అజ్మేర్ (రాజస్థాన్): రాజస్థాన్‌లోని అజ్మేర్ జిల్లాలో మాజీ సర్పంచ్‌తో పాటు ఆయన తల్లి, రెండో భార్య, మేనకోడలు హత్యకు గురయ్యారు. అనంతరం వారి మృతదేహాలను కారులో ఉంచి నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన వెనుక దీర్ఘకాలంగా కొనసాగుతున్న కుటుంబ కలహాలే కారణమని దర్యాప్తులో తేలినట్లు అధికారులు తెలిపారు.

శ్రీరాంపురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అజ్మేర్ నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాతీయ రహదారిపై, బాధితుల ఇంటికి 500 మీటర్ల దూరంలో మహీంద్రా స్కార్పియో కారు కాలిపోయిన స్థితిలో కనిపించింది. తొలుత ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన పోలీసులు, తర్వాత హత్యల కోణాన్ని వెలుగులోకి తెచ్చారు.

మృతులను మాజీ సర్పంచ్ రామ్‌సింగ్ చౌదరి, ఆయన తల్లి పూసీదేవి, రెండో భార్య సూర్యజ్ఞాన్ దేవి, మేనకోడలు మహిమా చౌదరిగా గుర్తించారు. కారులో మూడు కాలిన మృతదేహాలు లభించాయి. సూర్యజ్ఞాన్ మృతదేహం సమీపంలోని పొలంలో గొంతు కోసిన స్థితిలో కనిపించింది. అక్కడ రక్తపు ఆనవాళ్లు కూడా గుర్తించారు.

ఈ కేసులో రామ్‌సింగ్ తొలి భార్య సునీత, వారి కుమార్తె సరిత, మైనర్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, రామ్‌సింగ్ తన ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో నివసించేవాడు. దీనివల్ల తరచూ గొడవలు జరిగేవి. 2005లో సునీతను వివాహం చేసుకున్న రామ్‌సింగ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 2019లో సునీత అభ్యంతరాలను పట్టించుకోకుండా సూర్యజ్ఞాన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. సూర్యజ్ఞాన్ జిల్లా పరిషత్ సభ్యురాలిగా కొనసాగుతూ న్యాయ విద్యను అభ్యసిస్తోంది.

జిల్లా ఎస్పీ హర్ష్ వర్ధన్ అగర్వాలా మాట్లాడుతూ, తొలుత ఇది అగ్నిప్రమాదంగా కనిపించినా ప్రారంభ ఆధారాలు అనుమానాలు రేకెత్తించాయని చెప్పారు. పోలీసులు ఇంటికి వెళ్లినప్పుడు రామ్‌సింగ్ తన అనారోగ్యంతో ఉన్న తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడని సునీత చెప్పిందన్నారు.

అయితే విచారణలో మైనర్ కుమారుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన ఎలా జరిగిందో కూడా వివరించినట్లు చెప్పారు.

ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు

కుమారుడి వాంగ్మూలం ప్రకారం, రామ్‌సింగ్ మద్యం మత్తులో తరచూ తన తల్లి, అక్క, తనపై దాడులు చేసేవాడు. తల్లితో ఇంటి పనులన్నీ చేయించేవాడని, బయటకు వెళ్లనివ్వకుండా వేధించేవాడని చెప్పాడు. ఈ పరిస్థితుల వల్ల తండ్రిపై తీవ్ర ద్వేషం పెరిగిందని, ఒక రోజు చంపేస్తానని తల్లితో పలుమార్లు చెప్పినట్లు వెల్లడించాడు.

దర్యాప్తులో భాగంగా అతడు ముందుగానే హత్యకు ప్రణాళిక రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో కత్తి కూడా కొనుగోలు చేసినట్లు తేలింది.

మే 27న రామ్‌సింగ్, సునీత మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో కుమారుడు తండ్రిని చంపేస్తానని బెదిరించినట్లు సమాచారం. అదే రాత్రి నిద్రలో ఉన్న రామ్‌సింగ్‌పై దాడి చేసి గొంతు కోసినట్లు పోలీసులు తెలిపారు.

సమీపంలో నిద్రిస్తున్న సూర్యజ్ఞాన్ మేల్కొని ఘటనను చూసింది. విషయం బయటపడుతుందనే భయంతో ఆమెనూ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అరవాళ్లు విన్న పూసీదేవి, మహిమా అక్కడికి రావడంతో వారిపైనా దాడి చేశారు. మైనర్ కుమారుడు, అతడి తల్లి, అక్క కలిసి పదునైన ఆయుధాలు, బరువైన వస్తువులతో దాడి చేసి ఇద్దరినీ చంపినట్లు పోలీసులు తెలిపారు. సాక్షులు మిగలకుండా చేయడానికే ఈ హత్యలు చేసినట్లు భావిస్తున్నారు.

హత్యల తర్వాత సమీపంలో ఉన్న ట్రాక్టర్ నుంచి డీజిల్ తీసుకుని మృతదేహాలను లాగి స్కార్పియోలో ఉంచారు. ఆ తర్వాత కారును ఇంటి నుంచి 500 మీటర్ల దూరానికి తీసుకెళ్లి నిప్పంటించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఫోరెన్సిక్ బృందాలు పరిశీలించినప్పుడు కారు వెనుక సీట్లు మడిచివేసి ఉన్నట్లు గుర్తించాయి. దీంతో మృతదేహాలను కారులో ఉంచేలోపే బాధితులు మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు.

ఇంటి గోడలు, నేలపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. రక్తపు ఆనవాళ్లు ఉన్న రెండు ఇటుకలు, అగ్గిపెట్టె కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను చెరిపివేయడానికి నీరు, రసాయనాలు ఉపయోగించినట్లు గుర్తించారు.

మొబైల్ టవర్ డేటా, ఫోరెన్సిక్ ఆధారాల ఆధారంగా సునీత, ఆమె కుమార్తె, మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో కుమారుడు మరో విషయం కూడా వెల్లడించినట్లు పోలీసులు చెప్పారు. గతంలో ఆహారంలో విషం కలిపి, గనుల ప్రాంతంలోని కొండపై నుంచి తోసేయాలని ప్రయత్నించి తండ్రిని చంపాలనుకున్నా విఫలమయ్యానని చెప్పినట్లు తెలిపారు.

చివరకు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కత్తితో ఈ హత్యలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. మైనర్ ప్రస్తుతం పోలీసు అదుపులో ఉండగా, అతడి తల్లి, అక్కను మరింతగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media