అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో మూడు రాజధానుల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన కొన్ని వ్యాజ్యాలు ఇప్పుడు నిరర్థకమయ్యాయని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై ఇంకా ఏవైనా నిరర్థక పిటిషన్లు పెండింగ్లో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయవాదులను ఆదేశించింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ నైనాల జయసూర్య, జస్టిస్ బి.ఎస్. భానుమతిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఈ కేసుపై విచారణ జరిపింది.
మూడు రాజధానుల చట్టాలపై వ్యాజ్యాలు
గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాలను సవాలు చేస్తూ రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్లపై 2022 మార్చి 3న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అమరావతినే ఏకైక రాజధానిగా ధృవీకరించింది. రాజధాని కోసం రైతులతో కుదుర్చుకున్న భూసమీకరణ ఒప్పందాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అలాగే నిర్దిష్ట గడువులోగా అమరావతిలో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించింది.
సుప్రీంకోర్టులో కొనసాగుతున్న అప్పీళ్లు
హైకోర్టు తీర్పును అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. హైకోర్టు విధించిన గడువులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అప్పీళ్లపై ఈ నెల 29న సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.
ఈ నేపథ్యంలో హైకోర్టులోని సంబంధిత వ్యాజ్యాల విచారణను నవంబర్ 20కి వాయిదా వేస్తున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ప్రకటించింది.
అభివృద్ధి చేసిన ప్లాట్లపై రైతుల డిమాండ్
విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. అమరావతిలో రాజధాని పనులు ఇంకా పూర్తికాలేదని ఆయన కోర్టుకు తెలిపారు.
రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీనిపై ధర్మాసనం స్పందించింది.
హైకోర్టు గతంలో విధించిన గడువులపై సుప్రీంకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిందని ధర్మాసనం గుర్తుచేసింది. అందువల్ల కొత్తగా కాలపరిమితులు విధిస్తూ ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.
అయితే అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతులకు అప్పగించే అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి స్టే విధించలేదని మురళీధరరావు తెలిపారు.
మూడేళ్లలో పనులు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు.
మూడేళ్లలో పనులను పూర్తి చేస్తామని ప్రభుత్వం 2024 డిసెంబర్ 10న సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందని వివరించారు.
ఈ వివరాలను రికార్డులో నమోదు చేసి ఎస్ఎల్పీలను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు.
కొన్ని పిటిషన్లు నిరర్థకమయ్యాయని కేంద్రం తరఫు వాదన
మరోవైపు కేంద్రం తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో తాము గతంలో దాఖలు చేసిన కొన్ని వ్యాజ్యాలు నిరర్థకమయ్యాయని కోర్టుకు తెలిపారు.
ఆ వ్యాజ్యాలపై ఇక విచారణ అవసరం లేదని పేర్కొంటూ మెమో దాఖలు చేసినట్లు వివరించారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, మూడు రాజధానుల అంశానికి సంబంధించిన నిరర్థక పిటిషన్లు ఇంకా ఏవైనా పెండింగ్లో ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని న్యాయవాదులకు సూచించింది.



