ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించిన బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేయడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

రాష్ట్రపతి భవన్‌లో లోకేష్, ఎన్డీఏ ఎంపీలు కలిసి రాష్ట్రపతిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన అమరావతికి శాశ్వతత కల్పించడంపై రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అమరావతి చరిత్ర, అభివృద్ధి ప్రణాళికలు, రైతుల ఉద్యమం, మాస్టర్ ప్లాన్ వివరాలతో కూడిన పుస్తకాన్ని రాష్ట్రపతికి అందజేశారు. అమరావతి శంకుస్థాపన ప్రధాని నరేంద్ర మోదీ చేత జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయని లోకేష్ వివరించారు.రాజధాని కోసం రైతులు 34 వేల ఎకరాల భూములు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, వారి పోరాటం ఫలితమే అమరావతి అని పేర్కొన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రైతుల త్యాగాలను ప్రశంసిస్తూ, పోరాడి సాధించిన విజయాలు చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
