దేశమంతా గణతంత్ర వేడుకల సంబరాల్లో మునిగిపోగా.. అనంతపురం హార్మోనిసిటీ వాసులు మాత్రం దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక వీరపుత్రుడి త్యాగాన్ని స్మరిస్తూ కన్నీటి నివాళులర్పించారు. ‘ఆపరేషన్ సిందూర్’లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ జ్ఞాపకార్థం నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీ స్థానికులను కదిలించింది.
హార్మోనిసిటీ మెయిన్ గేట్ నుండి క్లాక్ టవర్ వరకు స్థానికులు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మురళి నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతి భాయ్ పాల్గొని, తన కొడుకు దేశం కోసం చేసిన త్యాగాన్ని తలుచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. హార్మోనిసిటీ ఎండీ రవికుమార్.. వీరజవాను తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి, రూ. 1 లక్ష ఆర్థిక సాయాన్ని అందజేశారు. దేశం కోసం పోరాడిన వీరుల కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యతని ఆయన పేర్కొన్నారు. “మనం ఈ రోజు ప్రశాంతంగా ఉన్నామంటే అది మురళి నాయక్ లాంటి వీరుల త్యాగఫలమే” అని ఎండీ రవికుమార్ కొనియాడారు.సరిహద్దుల్లో శత్రువుల చొరబాటును అడ్డుకుంటూ అసువులు బాసిన మురళి నాయక్ అమరత్వం అనంతపురం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
