అన్నమయ్య జిల్లా రాయచోటి మరియు రామాపురం పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు, వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడ్డ దొంగలను కడప జిల్లా చాపాడుకు చెందిన వినోద్, ఉదయ్ గా పోలీసులు గుర్తించారు. వీరు గత కొంతకాలంగా జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి సుమారు 130 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును అత్యంత వేగంగా ఛేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. వారికి ప్రోత్సాహకంగా నగదు రివార్డులను అందజేశారు. రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నిందితులను రిమాండ్కు తరలించి, వీరి వెనుక ఇతర ముఠాల ప్రమేయం ఉందేమోనన్న కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.
