విధి నిర్వహణలో అంకితభావం చాటుకున్న కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత నేడు ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఒక అరుదైన మరియు ఆత్మీయ దృశ్యం ఆవిష్కృతమైంది.

కొద్దిరోజుల క్రితం జయశాంతి చేసిన సేవలను గుర్తించిన మంత్రి అనిత, ఫోన్ ద్వారా ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా మంత్రిని కలవాలన్న జయశాంతి కోరిక మేరకు నేడు భేటీకి సమయం ఇచ్చారు.
కేవలం అభినందనలకే పరిమితం కాకుండా, జయశాంతి కుటుంబ సభ్యులతో కలిసి హోం మంత్రి టిఫిన్ చేశారు. ఒక సామాన్య పోలీస్ కుటుంబంతో మంత్రి ఇలా సమయం గడపడం అందరినీ ఆకట్టుకుంది.
జయశాంతి కుమారుడితో మంత్రి అనిత సరదాగా ముచ్చటించారు. వారి కుటుంబ యోగక్షేమాలను ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హోం మంత్రి భరోసా ఇచ్చారు.
