ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంకేతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు గుర్తుతెలియని వ్యక్తుల నుండి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపు లేఖ రావడం సంచలనం సృష్టించింది. ఒక సాధారణ పోస్ట్ కార్డుపై మావోయిస్టుల పేరుతో వచ్చిన ఈ లేఖ సచివాలయంలోని మంత్రి పేషీకి చేరింది. మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను కూడా హతమారుస్తామంటూ లేఖలో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

కేవలం కందుల దుర్గేష్‌కే కాకుండా, మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్‌లకు కూడా ఇలాంటి లేఖలే అందినట్లు సమాచారం. ఈ ఘటనపై మంత్రి వ్యక్తిగత కార్యదర్శి (PS) శ్రీనివాస్ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.సాధారణంగా మావోయిస్టుల లేఖలు ఇలా ఉండవని, ఎవరో ఆకతాయిలు లేదా ఉద్దేశపూర్వకంగా భయాందోళన సృష్టించేందుకు ఇలా చేసి ఉండవచ్చని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులకు బెదిరింపులు రావడంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. లేఖలో ఉన్న మొబైల్ నంబర్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక సర్పంచ్ పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
