మెడికో దీపిక మృతి కేసును పారదర్శకంగా విచారించి, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆమె విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, బాధితురాలి తోటి విద్యార్థులు మరియు అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
దీపిక చాలా ప్రతిభావంతురాలని, ఆమె ప్రవర్తనలో ఎలాంటి ఒత్తిడి లేదా అసాధారణ మార్పులు లేవని తోటి విద్యార్థులు తెలిపినట్లు చైర్‌పర్సన్ వెల్లడించారు. దీపిక మృతదేహంపై ఉన్న సూది గుర్తులు (Puncture Marks) దేనివల్ల వచ్చాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉందన్నారు. నమూనాలను (Tissues) బయాప్సీ మరియు FSL పరీక్షల కోసం పంపామని, నివేదికలు రావడానికి 2-3 వారాలు పడుతుందని పేర్కొన్నారు. ఆహారం వల్ల విషప్రయోగం జరిగి ఉండవచ్చనే అనుమానాలను ఆమె తోసిపుచ్చారు. దీపికతో కలిసి భోజనం చేసిన జూనియర్ డాక్టర్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.వాంతుల నివారణకు వాడే ‘ఆండన్సెట్రాన్’ ఇంజెక్షన్ తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు.కాల్ డేటా రికార్డ్స్ (CDR) మరియు పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాతే ఇది ఆత్మహత్యా లేక ఇతర కారణాలా అనేది తెలుస్తుందని, దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామని ఆమె స్పష్టం చేశారు.
