ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. మొత్తం 17 పనిదినాల పాటు సభ సాగనుంది. అవసరమైతే సమావేశాలను మరింత పొడిగించే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది.

ఈ నెల 14న (శనివారం) ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు వ్యవసాయ బడ్జెట్‌ను కూడా సభ ముందుకు తీసుకురానున్నారు.
ఫిబ్రవరి 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై సుదీర్ఘ చర్చ జరగనుంది. 18న చర్చ ముగిసిన తర్వాత ఆర్థిక మంత్రి సమాధానం ఇస్తారు. ఫిబ్రవరి 15 (ఆదివారం – మహా శివరాత్రి), 16 (మహా శివరాత్రి మరుసటి రోజు) సభకు సెలవు ప్రకటించారు. మార్చి 1, 2, 3 తేదీల్లో కూడా సెలవు ఉంటుంది.

ఫిబ్రవరి 19 నుంచి 8 రోజుల పాటు వివిధ శాఖల డిమాండ్లపై చర్చించి ఆమోదం తెలపనున్నారు.ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ జరుగుతుంది. రోజూ ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలను ముగించి, తప్పనిసరిగా జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో సభ్యుల కోసం ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 6న అమరావతిలో ప్రజాప్రతినిధుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌లకు చట్టబద్ధత కల్పించనుంది.
