నక్కపల్లి మండలంలోని హెటీరో డ్రగ్స్ ల్యాబ్స్ లిమిటెడ్ యూనిట్-3లో శుక్రవారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కార్యాలయ గదిలోని లేయర్ స్లాబ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందగా, మరో అధికారికి గాయాలయ్యాయి.
ఆఫీస్ రూమ్ స్లాబ్ కూలిన సమయంలో అక్కడే ఉన్న అసిస్టెంట్ మేనేజర్ బి. చిరంజీవి (39) పై శిథిలాలు పడటంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సహచర ఉద్యోగులు వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో ఒక సీనియర్ మేనేజర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన అరిలోవలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న నక్కపల్లి సీఐ మురళి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరిశ్రమలో భద్రతా లోపాలపై కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిరంజీవి మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

