కష్టకాలంలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆపద్బాంధవుడిలా నిలుస్తోందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరు వేదాయపాళెంలోని టీడీపీ కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 27.14 లక్షల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు 672 మందికి మొత్తం రూ. 6.28 కోట్ల సహాయాన్ని అందించినట్లు సోమిరెడ్డి వెల్లడించారు.గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ వ్యవస్థ నిర్వీర్యమైందని, అపోలో, కిమ్స్ వంటి పెద్ద ఆస్పత్రులు కూడా సేవలు నిలిపివేశాయని విమర్శించారు. అప్పుడు సీఎం సహాయనిధి ఎవరికి అందిందో కూడా తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు వైద్య ఖర్చుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికి అత్యంత ఉదారంగా, వేగంగా నిధులు మంజూరు చేస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.
