ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలుచోట్ల 48 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న ఆరు రోజులు అత్యంత కీలకమని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగటి వేళ బయటకు రావడానికి కూడా జనం భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఆరు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
దక్షిణ కోస్తా ప్రాంతంలో హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాయలసీమ ప్రాంతాల్లో 40 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించారు.
ఉత్తర కోస్తా జిల్లాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అక్కడక్కడా వర్షాలు కూడా పడొచ్చని చెప్పారు. రాష్ట్రంలోని 74 మండలాల్లో తీవ్ర వడగాలులు, 232 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండొచ్చని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణలోనూ ఎండలు మండిపోతున్నాయి. పలుచోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. ఉదయం ఏడు గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. సాయంత్రం నాలుగు గంటల వరకూ వేడి తగ్గడం లేదు.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు చెప్పారు.
మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈరోజు వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, పొడి వాతావరణం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

