ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో మండే ఎండలు కొనసాగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నేడు, రేపు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎండల తీవ్రత కొనసాగనుంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

