విశాఖపట్నంకు చెందిన 29 ఏళ్ల ఒక పేద మహిళ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. కానీ, అది ఆమె జీవితాంతానికి దారితీసింది. మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్ కేంద్రంగా సాగుతున్న అక్రమ అవయవ విక్రయాల ముఠాకు ఆమె బలైపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లో కరడుగట్టిన అవయవ అక్రమ రవాణా నెట్వర్క్ను వెలుగులోకి తెచ్చింది.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను, అమాయక మహిళలను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటోంది. లక్షల రూపాయలు ఆశచూపి ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అవయవ మార్పిడి చేయడమే కాకుండా, శస్త్రచికిత్స విఫలమైనప్పుడు బాధితుల మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లా (ప్రస్తుతం అన్నమయ్య జిల్లా) మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఈ అక్రమ దందాకు అడ్డాగా మారినట్లు దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్లో దళారులు, కొంతమంది వైద్యులు మరియు ఆసుపత్రి యాజమాన్యాల ప్రమేయంపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు
