మహానాడు 2026 వేదిక ఎంపికపై సమగ్ర కసరత్తు

April 11, 2026 5:42 PM

విజయనగరం/శ్రీకాకుళం, ఏప్రిల్ 10: స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి ఏడాది తెలుగు తమ్ముళ్లు అత్యంత వైభవంగా నిర్వహించే మహానాడు ఈసారి మరింత ఘనంగా, చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు 2026 నిర్వహణకు అనువైన వేదిక ఎంపిక కోసం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కీలక నేతలతో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఒకేరోజు మొత్తం తొమ్మిది అనువైన స్థలాలను పల్లా గారు పరిశీలించారు. వాస్తు అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, లక్షలాది మంది కార్యకర్తలు సౌకర్యవంతంగా పాల్గొనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించినట్లు తెలిపారు. మహానాడు నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాట్లు ఉండేలా కసరత్తు జరుగుతోందన్నారు.

నాథవలస (విజయనగరం పార్లమెంట్), పైడిభీమవరం (ఎచ్చర్ల నియోజకవర్గం), పిసిని రోడ్–పాటివాడిపాలెం (రణస్థలం మండలం), సింగవరం (డెంకాడ మండలం, నెల్లిమర్ల నియోజకవర్గం) తదితర ప్రాంతాల్లో స్థలాలను పరిశీలిస్తూ, మౌలిక వసతులు, విస్తరణ అవకాశాలు, రవాణా అనుసంధానం వంటి అంశాలపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.

ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మహానాడు ఆత్మగౌరవ సభ. పార్టీ ప్రతిష్టకు తగ్గట్టుగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచే విధంగా మహానాడు 2026ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నాం అని తెలిపారు.

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వం, యువతి ని ఆకర్షించేలా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మంత్రి శ్రీ నారా లోకేష్ గారి కార్యచరణతో మహానాడు మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబడుతుందని పల్లా గారు పేర్కొన్నారు. అన్ని అంశాలను సమీక్షించి తగిన వేదికను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. మహానాడు 2026ను పార్టీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిపే దిశగా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పల్లా శ్రీనివాసరావు గారు పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన సత్యనారాయణ, జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య, పిపిపి కిమిడి నాగార్జున, నెల్లిమర్ల ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media