సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ నకిలీ వ్యాపార సంస్థల పేర్లతో మ్యూల్ బ్యాంక్ ఖాతాలు తెరిచిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ మర్కంటైల్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్‌కు చెందిన బ్రాంచ్ మేనేజర్, సేల్స్ మేనేజర్ కూడా నిందితులుగా ఉండటం కలకలం రేపుతోంది.
పహాడీ షరీఫ్‌కు చెందిన జవ్వాద్ ఖాద్రీ, మహమ్మద్ నౌషాద్ సులభంగా డబ్బు సంపాదించేందుకు సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలు సమకూర్చే పని చేపట్టారు. ‘స్టార్ అగ్రో ఇండస్ట్రీస్’ పేరిట నకిలీ పత్రాలు సృష్టించి అక్రమాలకు తెరలేపారు. నిబంధనలకు విరుద్ధంగా సేల్స్ మేనేజర్ ప్రణవరాజ్, బ్రాంచ్ మేనేజర్ శంకర్ రాథీ సహకారంతో కరెంట్ ఖాతాలు తెరిచారు. అనంతరం ఆ ఖాతా వివరాలను (ATM కార్డ్, చెక్ బుక్, ఇంటర్నెట్ బ్యాంకింగ్) సైబర్ మోసగాళ్లకు అప్పగించారు. కేవలం ఒక ఖాతా ద్వారానే అక్టోబర్ 2025లో రూ. 6.67 లక్షల అక్రమ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అదే బ్యాంకు శాఖలో సుమారు 30కి పైగా ఇలాంటి మ్యూల్ ఖాతాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. డబ్బు కోసం బ్యాంక్ ఖాతాలు, కేవైసీ పత్రాలు ఇతరులకు ఇవ్వడం నేరమని డీసీపీ టి. సాయి మనోహర్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే బ్యాంకు సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు.సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
