నగరంలో ఆహార భద్రతా అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు సంకటంగా మారుతోందని విశాఖ నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర ఆరోపించారు. గురువారం ఫుడ్ సేఫ్టీ కార్యాలయ ప్రాంగణంలో నిరుపయోగంగా ఉన్న ‘ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్’ వాహనం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు.
2024 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన ఆహార తనిఖీ వాహనం, యంత్రాలు రెండేళ్లు గడుస్తున్నా ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంపై రవీంద్ర మండిపడ్డారు.సమాజంలో క్యాన్సర్ కేసులు పెరగడానికి ఆహార కల్తీయే ప్రధాన కారణమని, హాస్టళ్లలో విద్యార్థులు అస్వస్థతకు గురై చనిపోతున్నా అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. సిబ్బంది కొరత వల్లే వాహనాన్ని వాడలేకపోయామని జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి వివరణ ఇచ్చారు. రాబోయే 15 రోజుల్లో సిబ్బందిని నియమించి, వాహనాన్ని వినియోగంలోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఆహార విక్రయ కేంద్రాల వద్ద అధికారుల ఫోన్ నంబర్లు, టోల్ ఫ్రీ నంబర్లు ప్రదర్శించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డి.ఆనంద్, ధనరాజ్ నాయక్, టి.భారతి తదితరులు పాల్గొన్నారు.
