అమెరికా: లాంచ్‌ప్యాడ్‌పైనే భారీ పేలుడు
సిబ్బంది సురక్షితమేనన్న జెఫ్ బెజోస్
అమెరికాకు చెందిన అంతరిక్ష సంస్థ Blue Origin రాకెట్ ఫ్లోరిడాలో పరీక్షల సందర్భంగా లాంచ్‌ప్యాడ్‌పైనే పేలిపోయినట్లు కనిపిస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోల్లో రాకెట్ ఒక్కసారిగా భారీ అగ్నిగోళంగా మారి పరిసర ప్రాంతాలను మంటలు చుట్టుముట్టిన దృశ్యాలు కనిపించాయి.
ఈ ఘటనపై బ్లూ ఒరిజిన్ స్పందిస్తూ.. హాట్‌ఫైర్ పరీక్షల సమయంలో “అసాధారణ పరిస్థితి” ఏర్పడిందని తెలిపింది. అయితే అక్కడ ఉన్న సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారని వెల్లడించింది.
Jeff Bezos 2000లో స్థాపించిన ఈ అంతరిక్ష సంస్థ ప్రస్తుతం పునర్వినియోగ రాకెట్లు, ఉపగ్రహ ప్రయోగాల రంగంలో పనిచేస్తోంది.
ఫ్లోరిడాలోని Cape Canaveralలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని బ్రెవార్డ్ కౌంటీ అత్యవసర నిర్వహణ అధికారులు తెలిపారు.
జెఫ్ బెజోస్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారు. ప్రమాదానికి అసలు కారణం ఇప్పుడే చెప్పలేం. దానిని గుర్తించే పనిలో ఉన్నాం. ఇది కఠినమైన రోజు. అయినప్పటికీ అవసరమైన పునర్నిర్మాణం చేసి మళ్లీ ప్రయోగాలను కొనసాగిస్తాం” అని పేర్కొన్నారు.
United States Space Force తెలిపిన వివరాల ప్రకారం.. అత్యవసర బృందాలు ఘటనాస్థలంలో పనిచేస్తున్నాయి. ప్రమాదానికి కారణమైన అంశాలను గుర్తించేందుకు బ్లూ ఒరిజిన్తో కలిసి అందుబాటులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. రానున్న ప్రయోగానికి ముందు నిర్వహిస్తున్న పరీక్షల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Jared Isaacman స్పందిస్తూ.. “అంతరిక్ష ప్రయోగాలు అత్యంత క్లిష్టమైనవి. భారీ రాకెట్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం చాలా కష్టం. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తుకు మద్దతు ఇస్తాం” అన్నారు.
Federal Aviation Administration కూడా ఈ ఘటనపై దృష్టి సారించింది. అయితే ఈ పరీక్ష తమ అనుమతి పరిధిలోని కార్యకలాపాల్లో భాగం కాదని పేర్కొంది. గగనతల రాకపోకలపై ఎలాంటి ప్రభావం లేదని వెల్లడించింది.
గత నెలలో కూడా బ్లూ ఒరిజిన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. New Glenn రాకెట్‌తో AST SpaceMobile ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపే ప్రయత్నం పూర్తిస్థాయిలో విజయవంతం కాకపోవడంతో దర్యాప్తు చేపట్టాలని FAA ఆదేశించింది.
అయితే గత నవంబర్‌లో న్యూ గ్లెన్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన బ్లూ ఒరిజిన్.. దాని పునర్వినియోగ బూస్టర్‌ను తొలిసారి సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విజయం సాధించింది.

