వాహనదారులకు కేంద్రం తీపి కబురు
దేశంలోని వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా ఆధునిక BS-6 వాహనాలు ఉపయోగించే వారికి ఊరట కల్పించింది. వాహనం వయసు, దాని కేటగిరీ ఆధారంగా PUC సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధిని పెంచింది.
ఈ మేరకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కు సవరణలు చేసింది. ‘కేంద్ర మోటారు వాహనాల (పదహారవ సవరణ) నిబంధనలు 2026’ పేరుతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలతో వాహనదారులు తరచూ PUC సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం తగ్గనుంది.
ప్రైవేట్ BS-6 వాహనాలకు మూడేళ్ల గడువు
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రైవేట్ BS-6 వాహనదారులకు కేంద్రం భారీ ఊరట ఇచ్చింది. సొంత అవసరాల కోసం ఉపయోగించే నాన్-ట్రాన్స్‌పోర్ట్ వాహనాలకు ఈ సౌకర్యం వర్తిస్తుంది.
వాహనం రిజిస్ట్రేషన్ అయిన తేదీ నుంచి ఆరేళ్ల వరకు PUC సర్టిఫికెట్ చెల్లుబాటు వ్యవధి మూడేళ్లుగా ఉంటుంది.
అంటే ఈ ఆరేళ్ల సమయంలో PUC రెన్యూవల్ చేసుకున్నప్పుడు కొత్త సర్టిఫికెట్ మూడేళ్ల గడువుతో జారీ అవుతుంది.
అయితే వాహనం వయసు పెరిగే కొద్దీ ఈ గడువు తగ్గుతుంది. ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య వయసున్న ప్రైవేట్ వాహనాలకు ఏడాది పాటు మాత్రమే PUC చెల్లుబాటు అవుతుంది.
పదేళ్లు దాటిన వాహనదారులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలి.
కమర్షియల్ BS-6 వాహనాలకు రెండేళ్ల గడువు
రవాణా అవసరాల కోసం ఉపయోగించే కమర్షియల్ BS-6 వాహనాలకు కూడా కేంద్రం కొత్త గడువులను ప్రకటించింది.
అయితే ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే వీటికి కొంత భిన్నమైన నిబంధనలు వర్తిస్తాయి.
ఆరేళ్ల వయసు వరకు కమర్షియల్ BS-6 వాహనాల PUC సర్టిఫికెట్ రెండేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆరేళ్ల నుంచి పదేళ్ల మధ్య వయసున్న వాహనాలకు ఏడాది గడువు ఉంటుంది.
పదేళ్లు దాటిన వాణిజ్య వాహనాలకు మాత్రం ఆరు నెలలకే PUC చెల్లుబాటు పరిమితమవుతుంది. ఈ విధంగా వాహనం వయసును బట్టి రెన్యూవల్ గడువులను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
BS-1, BS-2, BS-3 వాహనాలకు మూడు నెలలే
పాత వాహనాల విషయంలో మాత్రం కేంద్రం పెద్దగా మార్పులు చేయలేదు. BS-1, BS-2, BS-3 ప్రమాణాలు కలిగిన అన్ని వాహనాలకు PUC సర్టిఫికెట్ కేవలం మూడు నెలల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
అంటే ఈ వాహనాల యజమానులు ప్రతి మూడు నెలలకు ఒకసారి సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాలి. ఇక BS-4 వాహనాలకు ఆరు నెలల గడువు వర్తిస్తుంది.
దీంతో పాత వాహనాలు ఉపయోగించే వారు తమ PUC సర్టిఫికెట్ గడువును ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. గడువు ముగిసేలోపు రెన్యూవల్ చేసుకోవడం మంచిది.
పాత PUC సర్టిఫికెట్లకు కొత్త నిబంధనలు ఎప్పటి నుంచి?
ఇప్పటికే PUC సర్టిఫికెట్లు తీసుకున్న వాహనదారులకు కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. కొత్త నిబంధనలు అమల్లోకి రాకముందు జారీ చేసిన పాత సర్టిఫికెట్లకు వాటి ప్రస్తుత గడువు ముగిసే వరకు పాత నిబంధనలే వర్తిస్తాయి.
ప్రస్తుత సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత మొదటిసారి రెన్యూవల్ చేసుకునే సమయంలో కొత్త కాలపరిమితి అమల్లోకి వస్తుంది. అంటే వెంటనే పాత సర్టిఫికెట్లన్నింటినీ మార్చుకోవాల్సిన అవసరం లేదు.
గడువుకు 10 రోజుల ముందే దరఖాస్తు చేస్తే..
PUC సర్టిఫికెట్ రెన్యూవల్ సమయంలో దరఖాస్తు చేసే తేదీ కూడా కీలకంగా ఉంటుంది.
ప్రస్తుత సర్టిఫికెట్ గడువు ముగియడానికి 10 రోజుల ముందే కొత్త సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది.
అలాంటి సందర్భాల్లో కొత్త PUC సర్టిఫికెట్ గడువు పాత సర్టిఫికెట్ ముగిసిన తేదీ నుంచే ప్రారంభమవుతుంది. దీనివల్ల రెండు సర్టిఫికెట్ల మధ్య గడువు విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఒకవేళ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత రెన్యూవల్ కోసం దరఖాస్తు చేస్తే మాత్రం కొత్త సర్టిఫికెట్ దరఖాస్తు చేసిన తేదీ నుంచే అమల్లోకి వస్తుంది.
వాహనదారులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా కొత్త BS-6 ప్రైవేట్ వాహనాలు ఉపయోగించే వారికి ఎక్కువ ప్రయోజనం కలగనుంది. గతంలో తరచూ PUC సర్టిఫికెట్ రెన్యూవల్ చేసుకోవాల్సిన అవసరం ఉండేది.
ఇప్పుడు వాహనం వయసు, కేటగిరీ ఆధారంగా ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే అవకాశం ఏర్పడింది.
అయితే అన్ని వాహనాలకు ఒకే గడువు ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ వాహనం BS ప్రమాణం, రిజిస్ట్రేషన్ తేదీ, ప్రైవేట్ లేదా కమర్షియల్ కేటగిరీ ఆధారంగా వర్తించే గడువును తెలుసుకోవాలి.
సర్టిఫికెట్ గడువు ముగియకముందే రెన్యూవల్ చేసుకోవాలి.



