ప్రజలకు గవర్నర్, సీఎం శుభాకాంక్షలు
అమరావతి: శ్రీకృష్ణ Janmashtami సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఏపీ ప్రజలకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ చెప్పారు. ఈ పండుగను ప్రజలు ఎంతో ఆనందంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు.
భగవద్గీత ద్వారా శ్రీకృష్ణుడు అందించిన సందేశం సామరస్య సమాజ నిర్మాణానికి ఎంతో ముఖ్యమని గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలో ప్రజల మధ్య సోదరభావం, స్నేహం, సామరస్యం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం శాంతి, అభివృద్ధి, సౌభాగ్యానికి దారితీయాలని కోరుకున్నారు.
శ్రీకృష్ణుడి బోధనలు గుర్తు చేసుకున్న చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుగు ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని ఎదుర్కొనేందుకు శ్రీ మహావిష్ణువు తీసుకున్న మరో అవతారమే శ్రీకృష్ణుడి అవతారం అని చంద్రబాబు పేర్కొన్నారు.
కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యాన్ని వివరించిన శ్రీకృష్ణుడు జగద్గురువుగా నిలిచారని చెప్పారు.
శ్రీకృష్ణుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రజలందరూ శ్రీకృష్ణ జన్మాష్టమిని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ధర్మం, సత్యం వైపు నడవాలని పవన్ కల్యాణ్ పిలుపు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. భగవద్గీత ద్వారా మానవాళికి కర్తవ్యం, ధర్మం, సత్యం గురించి శ్రీకృష్ణుడు బోధించారని చెప్పారు.
శ్రీకృష్ణుడి జననం ఆధ్యాత్మిక విలువలతో పాటు జీవితంలోని ముఖ్యమైన సూత్రాలను గుర్తు చేస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. కష్టాలను ఎదుర్కొనే సమయంలో ధైర్యంగా నిలబడటం, బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించడం, ధర్మం వైపు నడవడం శ్రీకృష్ణుడి జీవితం నుంచి నేర్చుకోవచ్చని చెప్పారు.
ప్రజలకు జగన్ జన్మాష్టమి శుభాకాంక్షలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా జన్మాష్టమి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీకృష్ణుడి కృపతో ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆరోగ్యంగా, సౌభాగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ధర్మాన్ని కాపాడిన శ్రీకృష్ణుడు.. చివరికి సత్యమే గెలుస్తుందని ప్రపంచానికి చాటారని జగన్ అన్నారు.



