సంక్రాంతి వేడుకల కోసం తన స్వగ్రామం చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నారావారిపల్లె మరియు తిరుపతి పరిసర ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అభివృద్ధి, సంక్షేమం మరియు పండగ సందడి మేళవింపుగా ఈ పర్యటన సాగింది.

రూ. 1.4 కోట్లతో నిర్మించిన స్కిల్ బిల్డింగ్ సెంటర్ మరియు రూ. 4.27 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. రూ. 70 లక్షలతో ఏ-రంగంపేట నుంచి శేషాచల లింగేశ్వర స్వామి ఆలయం వరకు నిర్మించిన నూతన రహదారిని ప్రారంభించి, ఆలయంలో పూజలు చేశారు.

నీవా బ్రాంచ్ కెనాల్ నుంచి కల్యాణి డ్యామ్, మూలపల్లి చెరువు మరియు ఇతర చెరువులకు నీటిని తరలించే కీలక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మిల్లెట్ టిఫిన్స్, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించిన సందర్భంగా.. “నమస్తే సర్” అంటూ పలకరించిన అంగన్వాడీ చిన్నారుల వద్దకు వెళ్లి సీఎం ఆప్యాయంగా ముచ్చటించారు. షైనింగ్ సెంటర్ల వల్ల తమ పిల్లల్లో ఎదుగుదల కనిపిస్తోందని స్థానిక మహిళలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించే ‘సంజీవని’ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
