నీటి సంరక్షణకు వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్

April 5, 2026 11:08 PM

అమరావతి BNS ఏప్రిల్ 05: రాష్ట్రంలో నీటి భద్రత సాధిస్తే ఇతర రంగాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయటమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని.. వేసవి కంటే ముందు 6 మీటర్లు, వర్షపు సీజన్ పూర్తి అయ్యే నాటికి 3 మీటర్ల లోతులో భూగర్భజలాలు అందుబాటులో ఉండాలని ఆయన నిర్దేశించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంపై సాగునీటి సంఘాలు, మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం సీఎం టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.

ఇరిగేషన్, వ్యవసాయం, పంచాయితీరాజ్, అటవీ, పశు సంవర్థక శాఖలు సంయుక్తంగా ఈ జల సంరక్షణ కార్యక్రమాల్ని ముందుకు తీసుకు కెళ్లాలని సూచించారు. నీటి సంరక్షణ-జలవనరుల పరిరక్షణ అంశాలే అజెండాగా 100 రోజుల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు. సాగునీటి సంఘాలు కేంద్రీకృతంగా యాక్షన్ ప్లాన్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. రాష్ట్రంలోని 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులకు ఈ కార్యక్రమ నిర్వహణ చేప్టటే కీలక బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. నీటి భద్రత అంశంలో ప్రజలను భాగస్వాములను చేయాలని… దీన్నో ప్రజా ఉద్యమంగా మలచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 6 నుంచి జులై 14వ తేదీ వరకు నాలుగు దశల కార్యాచరణను ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 15 తేదీ వరకు పనుల గుర్తింపు కార్యక్రమం చేపట్టాలని… ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు గుర్తించిన పనులకు పరిపాలనా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. ఏప్రిల్ 21 నుంచి జూలై 9వ తేదీ వరకు పనులను చేపట్టాలని… జూలై 10 నుంచి 14 జూలై పూర్తి చేసిన పనులకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం సూచించారు. నీటి పొదుపును కీలకాంశంగా తీసుకుని.. ప్రతీ నీటి బొట్టనూ ఒడిసిపట్టేలా చూడాలని అన్నారు. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ చేపట్టాలని సూచించారు. నీటి భద్రత అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని.. సామూహిక బాధ్యత అని సీఎం వివరించారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతీ రైతుకు భరోసా ఇవ్వటం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయంతో సాగునీటి సంఘాలు, గ్రామ పంచాయతీల భాగస్వామ్యంతో కార్యక్రమం అమలు కావాలని అన్నారు.


ఆటోమొబైల్, వ్యాపారం, టెక్నాలజీ, ఫైనాన్స్, వినోదం, విద్య మరియు క్రీడలతో సహా వివిధ వర్గాలలో తాజా మరియు అత్యంత విశ్వసనీయ వార్తలను అందించే మీ విశ్వసనీయ వార్తల వేదిక!

Follow Us On Social Media

Get Latest Update On Social Media