తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి ప్రభుత్వం ఆరు నెలలు కూడా కొనసాగదని డీఎంకే సీనియర్ నేత, తిరుచ్చెందూరు ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ జోస్యం చెప్పారు.త్వరలోనే డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని అన్నారు. దక్షిణ తమిళనాడులో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అధికార తమిళగ వెట్రి కళగం సీనియర్ నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జునకు కూడా సవాల్ విసిరారు.
“ఇంకా నాలుగు నెలలే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఆధవ్ అర్జున అనే వ్యక్తి ఉన్నాడు. ధైర్యం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తా. తిరుచ్చెందూరులో ఇరువురం పోటీ పడదాం. ఇది మా ఊరు. ఎవరొచ్చినా ఓడిస్తాం” అని రాధాకృష్ణన్ అన్నారు.
తిరుచ్చెందూరు నియోజకవర్గం గత 25 ఏళ్లుగా రాధాకృష్ణన్‌కు బలమైన స్థావరంగా ఉంది. 2001లో తొలిసారి అన్నాడీఎంకే తరఫున గెలిచిన ఆయన, తర్వాత డీఎంకేలో చేరి 2009లో మళ్లీ విజయం సాధించారు.
మాజీ సీఎం స్టాలిన్ కోలత్తూరు నియోజకవర్గంలో ఓటమిపై కూడా రాధాకృష్ణన్ స్పందించారు. మాజీ డీఎంకే నేత వీఎస్ బాబు టీవీకేలో చేరి స్టాలిన్‌ను ఓడించారు. “స్టాలిన్ తిరుచ్చిలో పోటీ చేయాలని మేం కోరుతున్నాం. ఆయన కోలత్తూరును సింగపూర్‌లా మార్చారు” అని చెప్పారు.
రాధాకృష్ణన్ వ్యాఖ్యలపై ఇప్పటివరకు విజయ్ కార్యాలయం, టీవీకే లేదా ఆధవ్ అర్జున స్పందించలేదు. టీవీకే, డీఎంకే మధ్య రాజకీయ పోరు రోజురోజుకూ తీవ్రం అవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఏప్రిల్ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించింది. తమిళనాడులో మొత్తం 234 స్థానాల్లో 108 సీట్లు గెలుచుకుంది. దీంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే-అన్నాడీఎంకే ఆధిపత్యానికి చెక్ పడింది. అయితే పూర్తి మెజారిటీకి 10 సీట్లు తక్కువగా రావడంతో కాంగ్రెస్, రెండు వామపక్ష పార్టీలు, విదుతలై చిరుతైగల్ కచ్చి మద్దతు ఇచ్చాయి.సీఎం విజయ్ విశ్వాస పరీక్షలో 144 ఓట్లు సాధించి ప్రభుత్వం నిలబెట్టుకున్నారు. విజయ్ కు మద్దతు నిచ్చెన పార్టీలన్నీ గతంలో డీఎంకే కూటమిలోనే ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
