రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (SCSC) సంయుక్తంగా వట్టినాగులపల్లిలో ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026’ ఫేజ్–2 కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రిస్టిన్ ఐ హాస్పిటల్స్ సహకారంతో భారీ వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

లారీలు, టిప్పర్లు, బస్సుల డ్రైవర్లకు అనుభవజ్ఞులైన ఆప్టోమెట్రిస్టులు పరీక్షలు నిర్వహించారు. కంటి చూపులో స్వల్ప లోపాలు ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ డాక్టర్ ఎం. రమేష్ మాట్లాడుతూ.. యుద్ధాల్లో కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని అన్నారు. ప్రతి డ్రైవర్ ‘డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్’ పాటించాలని సూచించారు. ట్రాఫిక్ డీసీపీ రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ.. పిల్లియన్ రైడర్లు (వెనుక కూర్చునే వారు), 4 ఏళ్లు దాటిన పిల్లలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. డ్రింక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి పేర్కొన్నారు.ప్రిస్టిన్ ఐ హాస్పిటల్స్ డాక్టర్ శ్రావ్య మాట్లాడుతూ.. 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని, స్పష్టమైన చూపు ఉంటేనే ప్రయాణం సురక్షితమని తెలిపారు.
