గోదావరి జిల్లాల్లో సంక్రాంతి మర్యాదలకు పెట్టింది పేరు. అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుడికి జరిగే విందు వినోదాలు అంబరాన్నంటుతాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం జేగురుపాడులో ఓ కొత్త అల్లుడికి ఏకంగా 70 రకాల వంటకాలతో రాజభోజనం ఏర్పాటు చేసి గోదారోళ్ల గొప్పతనాన్ని చాటిచెప్పారు.

మేక మాంసం, కోడి, చేపలు, రొయ్యలు, పీతలు వంటి రక రకాల మాంసాహార వంటకాలతో పాటు సంప్రదాయ సంక్రాంతి పిండివంటలను అల్లుడి కోసం సిద్ధం చేశారు. జేగురుపాడుకు చెందిన కాంట్రాక్టర్ రంకిరెడ్డి సుబ్రహ్మణ్యం తన కుమార్తె లీలావతిని దామిరెడ్డిపల్లికి చెందిన నర్సరీ రైతు తోరాటి శివ సూర్యకు ఇచ్చి గతేడాది వివాహం చేశారు. ఈ ఏడాది తొలి సంక్రాంతి కావడంతో అల్లుడికి భారీ ఎత్తున మర్యాదలు చేశారు. కనుమ రోజున ఏర్పాటు చేసిన ఈ భారీ విందు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గోదావరి జిల్లాల ఆతిథ్యం ముందు ఎవరైనా సాటిరావాల్సిందేనని స్థానికులు గర్వంగా చెబుతున్నారు.
