బంగారం ధరలు మరింత పెరుగుతాయని కొంతకాలంగా అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ధరలు తగ్గుతుండటంతో ఇంకా పడిపోతాయని భావించిన చాలామంది కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ధరలు పెరగడంతో వినియోగదారులు అయోమయంలో పడుతున్నారు.
బంగారం, వెండి ధరల్లో స్థిరత్వం లేకపోవడంతో ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు తగ్గుతాయో అంచనా వేయడం కష్టంగా మారింది. ధరలు పెరిగినా, తగ్గినా ప్రస్తుతం మార్కెట్లో కొనుగోళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవని వ్యాపారులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం బంగారం, వెండి మార్కెట్‌పై పడుతోంది. ముఖ్యంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోలు, డీజిల్ భారాలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్న ప్రజలు బంగారం కొనుగోళ్లను తగ్గిస్తున్నారు. దీనికి తోడు ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కూడా ప్రభావం చూపుతోందని వ్యాపార వర్గాలు అంటున్నాయి.
అధిక జ్యేష్ఠ మాసం కారణంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు తగ్గడం కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు ధరల్లో ఊగిసలాట కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు కూడా బంగారంలో పెట్టుబడులకు ఆసక్తి చూపడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆఫర్లు ప్రకటిస్తున్నా జ్యువెలరీ దుకాణాలకు వినియోగదారుల రాక పెద్దగా కనిపించడం లేదు.
ఈరోజు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,45,160కి చేరింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,58,360గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,84,900 వద్ద ట్రేడవుతోంది. మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

