హైదరాబాద్: బంగారం ధరల్లో అనిశ్చితి కొనసాగుతోంది. ఒకరోజు ధరలు పెరగడం, మరుసటి రోజు తగ్గడం, ఇంకో రోజు నిలకడగా ఉండటంతో కొనుగోళ్లపై ప్రభావం పడుతోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం బంగారం, వెండి ధరల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ధరలు ఇంకా తగ్గుతాయన్న ఆశతో చాలామంది వేచి చూస్తున్నారు. మరోవైపు ధరలు పెరిగే అవకాశముందని భావిస్తున్న పెట్టుబడిదారులు పెట్టుబడులకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితులతో బంగారం కొనుగోళ్లు గతంతో పోలిస్తే మందగించాయి.
క్రూడాయిల్ ధరలు పెరగడం, అనేక దేశాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలపై నిపుణులు హెచ్చరిస్తుండటంతో బంగారం, వెండి కొనుగోళ్లకు ప్రజలు ముందుకు రావడం లేదని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ మరో ఏడాది వరకూ బంగారం కొనుగోలు తగ్గించి పొదుపు చర్యలు పాటించాలని చేసిన పిలుపు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిందని జ్యువెలరీ దుకాణాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు ఆగస్టు వరకూ పెద్దగా శుభకార్యాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాల కోసం బంగారం, వెండి కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా తగ్గింది.
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి.
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,46,110
- 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – రూ.1,59,390
- కిలో వెండి ధర – రూ.2,94,900
మధ్యాహ్నానికి ధరల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

