గుంటూరు–చిలకలూరిపేట జాతీయ రహదారిపై మున్సిపల్ సిబ్బంది చెత్తను డంప్ చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది. అంకిరెడ్డి పాలెం–పొత్తూరు మధ్య, వినాయకుడి ఆలయం మరియు కేర్ డెంటల్ కాలేజీ సమీపంలో నడిరోడ్డుపైనే చెత్తను వదిలేసి వెళ్లిన ఘటన స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది.

ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై చెత్త వేయడం ప్రజల భద్రతకు ముప్పుగా మారింది. గతంలో సర్వీస్ రోడ్లపై చెత్త వేయగా, ఇప్పుడు నేరుగా హైవేపైనే డంప్ చేయడం అధికారుల నిర్లక్ష్యాన్ని బయటపెడుతోంది.పవిత్రమైన దేవాలయం, ఆసుపత్రి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. మున్సిపల్ సిబ్బంది తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
