మిస్సింగ్ కేసుతో మొదలైన దర్యాప్తు
ఆగస్టు 14న ప్రసన్న కనిపించడం లేదంటూ అతని తల్లి శాంతమ్మ నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదే సమయంలో ఏకో పార్క్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
మృతదేహంపై ఉన్న దుస్తులను శాంతమ్మ పరిశీలించారు. అవి తన కుమారుడు ప్రసన్న ధరించినవేనని గుర్తించారు.
దీంతో మృతుడు ప్రసన్నేనని పోలీసులు నిర్ధారించారు. అనంతరం హత్య కోణంలో దర్యాప్తు చేపట్టారు.
వివాహేతర సంబంధంపై అనుమానంతో కక్ష
గుంటూరు సౌత్ డీఎస్పీ పూర్ణ చంద్రరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు బుల్లయ్యకు తురకపాలెంకు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది.
అదే మహిళతో ప్రసన్నకు కూడా వివాహేతర సంబంధం ఉందని బుల్లయ్య అనుమానించాడు. దీంతో ప్రసన్నపై కక్ష పెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పథకం ప్రకారం ప్రసన్నను మద్యం సేవించేందుకు ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు.
అనంతరం నల్లపాడు రోడ్డులోని జనచైతన్య ఫ్లాట్ల వద్ద ఏకో పార్క్ సమీపానికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
రాయితో దాడి.. ఆ తర్వాత పెట్రోల్ పోసి దహనం
ఏకో పార్క్ సమీపంలో ప్రసన్న తలపై రాయితో బలంగా కొట్టి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. హత్యకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసేందుకే మృతదేహాన్ని కాల్చినట్లు దర్యాప్తులో తేలింది.
నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. ప్రసన్నను హత్య చేసినట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల పాత్ర, ఇతర అంశాలపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.
కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గుంటూరు సౌత్ డీఎస్పీ పూర్ణ చంద్రరావు తెలిపారు.



