మియాపూర్: (బిఎన్ఎస్ మీడియా): క్రైస్తవ మతానికి అత్యంత ప్రాధాన్యమైన గుడ్ ఫ్రైడే సందర్భంగా మియాపూర్లోని కల్వరి టెంపుల్లో వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. యేసుక్రీస్తు త్యాగం, ప్రేమ, క్షమాగుణాలపై బ్రదర్ అందించిన దైవ సందేశం భక్తులను ఆలోచనలో ముంచెత్తింది. జీవితంలో నైతిక విలువలు పాటించాలని, ప్రేమ, సేవాభావంతో జీవించాలని ఆయన సందేశంలో సూచించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రీస్తు సిలువ (క్రూసిఫిక్షన్) ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలు, బాధలను కళ్లకు కట్టినట్లుగా ప్రతిబింబించిన ఈ ప్రదర్శన భక్తులను భావోద్వేగానికి గురి చేసింది. చాలామంది భక్తులు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థనలు చేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేసి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణకు స్థానిక పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
గుడ్ ఫ్రైడే సందేశం సమాజంలో శాంతి, సహనం, ప్రేమను పెంపొందించాలని పాస్టర్లు ఆకాంక్షించారు.
