మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శుక్రవారం కోటవురట్ల మండలం అణుకు గ్రామంలో పర్యటించిన ఆమెకు గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు.
దశాబ్దాల కాలంగా సరైన రహదారి లేక ఇబ్బందులు పడుతున్న అణుకు గ్రామానికి రూ. 2.50 కోట్లతో పక్కా రోడ్డు మంజూరు చేయడంపై గిరిజనులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పరిదేశమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం, మంత్రి గిరిజన కుటుంబాలతో కలిసి సంక్రాంతి-కనుమ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలో కొత్తగా రేషన్ డిపో ఏర్పాటు చేసినట్లు మంత్రి ప్రకటించారు. త్వరలోనే సెల్ టవర్ నిర్మాణం పూర్తి చేస్తామని, ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి (బాత్‌రూమ్) నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నింపడమే లక్ష్యమని మంత్రి అనిత పేర్కొన్నారు.
