54 మంది ప్రయాణికులతో వెళ్తుండగా స్టీరింగ్ విరిగిన వైనం
చిగురుమామిడి, సెప్టెంబర్ 02: హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు స్టీరింగ్ విరగడంతో అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 13 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు అదుపుతప్పి బావిలోకి..
హుస్నాబాద్ డిపోకు చెందిన ఏపీ 29 జెడ్ 2426 ఆర్టీసీ బస్సు 54 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తోంది.
ఇటీవల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
సుందరగిరి పరిధిలోని పెసరపల్లె దాటిన మూలమలుపు వద్ద డ్రైవర్ హరీష్ బస్సును మలుపుతుండగా స్టీరింగ్ విరిగిపోయింది.
దీంతో బస్సు అదుపుతప్పి సమీపంలోని కావటి అనిల్ కుమార్‌కు చెందిన వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది.
బస్సు ముందు టైర్లు బావి లోపలివైపు వెళ్లి ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు.
వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన కె. శిరీష, సిహెచ్. ఆర్యన్, హుస్నాబాద్‌కు చెందిన ప్రమీల, రామచంద్రం, మురళీకృష్ణ, లాస్య, గాంధీనగర్‌కు చెందిన లచ్చవ్వ, దినేష్, మోత్కుపల్లికి చెందిన లలిత, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌కు చెందిన కాంతమ్మ, రాములపల్లెకు చెందిన కనకవ్వ, గౌరవెల్లికి చెందిన కనకయ్య, నిమ్మలకు గాయాలయ్యాయి.
వీరిని ఎస్సై జగదీశ్వర్, పోలీసులు హుటాహుటిన 108 వాహనంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు
సుందరగిరి సమీపంలో బస్సు బావిలోకి దూసుకెళ్లిన విషయం తెలుసుకున్న ఎస్సై జగదీశ్వర్, హుస్నాబాద్ డీఎం వెంకన్న, చిగురుమామిడి తహసీల్దార్ కోడం కనకయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ప్రోక్లైన్ సహాయంతో బస్సును బావి నుంచి బయటకు తీసి హుస్నాబాద్‌కు తరలించారు.
గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై హుస్నాబాద్ ఆసుపత్రి సిబ్బందిని ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.
వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. స్టీరింగ్ విరగడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.



