హైదరాబాద్: హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టినట్లు రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన అనేక ఫ్లాట్లు అమ్ముడుకాకపోవడంతో బిల్డర్లు ధరలు తగ్గించి విక్రయించేందుకు ముందుకు వస్తున్నారు. కొత్త ఇల్లు కొనాలనుకునే వారికి ఇది అనుకూల సమయమని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నగరంలో గత కొన్నేళ్లుగా భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ వెంచర్లు వెలిశాయి. మేడ్చల్ జిల్లా పరిసరాలు, బెంగళూరు జాతీయ రహదారి మార్గం, శ్రీశైలం రహదారి వైపు అనేక గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ ప్రాజెక్టులు నిర్మించారు. అయితే ప్రస్తుతం నెలకొంటున్న ఆర్థిక మందగమనం ప్రభావంతో కొనుగోలుదారులు ముందుకు రావడం తగ్గిందని చెబుతున్నారు.
ఇటీవల వరకూ చదరపు అడుగుకు రూ.5 వేల వరకు ధర పలికిన కొన్ని ప్రాజెక్టుల్లో ఇప్పుడు రూ.3,900కే విక్రయించేందుకు బిల్డర్లు సిద్ధమవుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ముందుగానే బుక్ చేసుకున్న ఫ్లాట్లను మినహాయిస్తే ఇంకా అనేక యూనిట్లు ఖాళీగా ఉన్నాయని సమాచారం. దీంతో పెట్టుబడి తిరిగి రావాలన్న ఉద్దేశంతో బిల్డర్లు ధరల్లో సడలింపులు ఇస్తున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ రూ.60 లక్షల వరకు పలికిన డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను ప్రస్తుతం రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
బ్యాంకు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ భారం పెరుగుతుండటంతో, ప్రస్తుతం వచ్చిన ధరకే విక్రయించడం మంచిదని పలువురు రియల్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇంటి స్థలాల ధరల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. ఇండిపెండెంట్ ఇళ్లకు ఇప్పటికీ మంచి డిమాండ్ కొనసాగుతోందని, ధరల తగ్గుదల ప్రధానంగా అపార్ట్మెంట్ విభాగంలోనే కనిపిస్తోందని పేర్కొంటున్నారు. అందువల్ల హైదరాబాద్‌లో ఇల్లు కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారినట్లు మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

